అధికార పీఠం నుంచి ఇక తప్పుకోనున్న యడియూరప్ప!

  • కర్ణాటకలో బీజేపీని తొలిసారి అధికారంలోకి తెచ్చిన ఘనత యడియూరప్పదే
  • బలమైన లింగాయత్ సామాజికవర్గ నేతగా యడ్డీకి గుర్తింపు
  • సోమవారం సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం
కర్ణాటక రాజకీయాల్లో యడియూరప్పది ఒక ప్రత్యేకమైన చరిత్ర. రాష్ట్రంలో బీజేపీని తొలిసారి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనదే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెపుతుంటారు. కర్ణాటకలో చాలా బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడియూరప్పకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. అనేక మఠాధిపతులు కూడా ఆయనకు అండగా ఉన్నారు.

యడియూరప్ప నాయకత్వంలోనే కర్ణాటకలో బీజేపీ తొలిసారి అధికార పీఠాన్ని అధిరోహించింది. ఆ తర్వాత మధ్యలో బీజేపీ నుంచి ఆయన బటయకు వచ్చిన సందర్భంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అలాంటి బలమైన నేత యడియూరప్ప రాజకీయ ప్రస్థానం తుది అంకానికి చేరుకుంది. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించేందుకు పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని యడియూరప్ప కూడా ధ్రువీకరించారు.

ఈ నెల 26న తమ రెండేళ్ల పాలనపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని యడియూరప్ప తెలిపారు. ఆ తర్వాత పార్టీ అధిష్ఠానం సూచించినట్టు నడుచుకుంటానని చెప్పారు. 75 ఏళ్ల వయసు పైబడిన వారిని కీలక పదవులలో కొనసాగించే సంప్రదాయం బీజేపీలో లేదని... అయితే తన కోసం రెండేళ్ల వెసులుబాటును హైకమాండ్ ఇచ్చిందని తెలిపారు. పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. తన గురించి ఎవరూ ఆందోళనలు చేయవద్దని విన్నవించారు. వచ్చే సోమవారం సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు కర్ణాటక సీఎం రేసులో డజను మందికి పైగా నేతల పేర్లు వినిపిస్తున్నాయి.


More Telugu News