దైనిక్ భాస్కర్ తో పాటు మరో న్యూస్ ఛానల్ పై ఐటీ దాడులు

  • దైనిక్ భాస్కర్ కు చెందిన 35 చోట్ల సోదాలు
  • ప్రమోటర్ల నివాసాలు, కార్యాలయాలపై కూడా దాడులు
  • మోదీ ప్రభుత్వ  వైఫల్యాలపై కథనాలు ప్రచురించినందుకే దాడులు చేశారన్న జైరామ్ రమేశ్
ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో న్యూస్ ఛానల్ పై ఈ ఉదయం ఐటీ దాడులు జరిగాయి. పన్నులు ఎగవేశాయనే అభియోగాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో దైనిక్ భాస్కర్ కు చెందిన 35 ప్రాంతాల్లో అధికారులు దాడి జరిపారు. ఈ సంస్థ ప్రమోటర్ల నివాసాలు, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. జైపూర్, అహ్మదాబాద్, భోపాల్, ఇండోర్ కార్యాలయాలపై దాడులు జరిగినట్టు దైనిక్ భాస్కర్ కు చెందిన సీనియర్ ఎడిటర్ తెలిపారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన భారత్ సమాచార్ ఛానల్ పై కూడా ఐటీ దాడులు జరిగాయి. ట్యాక్స్ డాక్యుమెంట్ల కోసం ఈ ఛానల్ ఎడిటర్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మరోవైపు ఈ దాడులపై విపక్షాలు మండిపడుతున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమయిందనే కథనాలను ప్రసారం చేసినందుకే ఈ సంస్థలపై ఐటీ దాడులు చేయించారని ఆరోపించాయి. ప్రధాని మోదీ వైఫల్యాలను లేవనెత్తినందుకు ఆ సంస్ధలు మూల్యం చెల్లించుకుంటున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అన్నారు.


More Telugu News