నేడు హైదరాబాదుకు రేవంత్.. విమానాశ్రయం నుంచి నేరుగా రామోజీరావు వద్దకు పయనం!

  • రేపు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ప్రమాణస్వీకారం
  • బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ అయిన రేవంత్
  • ఈ సాయంత్రం ఉత్తమ్, భట్టివిక్రమార్కలతో భేటీ
టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఐదు వేల బైక్ లతో ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కార్యాచరణ రూపొందించాయి. ప్రతి డివిజన్ నుంచి కనీసం 500 బైకులు పాల్గొనాలని నిర్ణయించారు. మరోవైపు వరుసగా కీలక నేతలను కలుస్తూ రేవంత్ బిజీగా ఉన్నారు.

బెంగళూరుకు వెళ్లిన ఆయన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో పాటు పలువురు నేతలను కలిశారు. ఈరోజు ఆయన బెంగళూరు నుంచి హైదరాబాదుకు చేరుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేవంత్ రెడ్డి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ఆయన మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

ఈ సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కలతో రేవంత్ భేటీ కానున్నారు. వాస్తవానికి రేవంత్ ను కలవడానికి వీరిద్దరూ ఆసక్తి చూపలేదని సమాచారం. అయితే మల్లు రవి వీరితో చర్చలు జరిపి ఒప్పించినట్టు తెలుస్తోంది. మల్లు రవి మంత్రాంగంతో వారు కాస్త దిగొచ్చినట్టు చెప్పుకుంటున్నారు.


More Telugu News