ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన పశ్చిమబెంగాల్ గవర్నర్

  • ప్రసంగం సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
  • శాంతిభద్రతల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్
  • ఆందోళనలు తగ్గకపోవడంతో సభ నుంచి వెళ్లిపోయిన గవర్నర్
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ సమావేశాల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగిస్తున్న గవర్నర్ జగదీప్ ధన్కర్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బెంగాల్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసను నిరసిస్తూ అరుపులు, కేకలతో, ప్లకార్డులను చేతబట్టి ఆందోళనకు దిగారు.

ఈ నిరసనల నేపథ్యంలో గవర్నర్ తన ప్రసంగాన్ని దాదాపు 10 నిమిషాల సేపు ఆపేశారు. గత మూడేళ్లుగా గవర్నర్ కు, సీఎం మమతా బెనర్జీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఎన్నో అంశాలకు సంబంధించి వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. పలుమార్లు ఇద్దరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని చదవకుండా, గవర్నర్ తనదైన శైలిలో ప్రసంగించే అవకాశం ఉందని టీఎంసీ నేతలు కూడా భావించారు.

అయితే వాస్తవాల గురించి గవర్నర్ మాట్లాడాలని, రాష్ట్రంలో పతనమైన శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. నినాదాలతో సభను హోరెత్తించారు. ఈ అంశాలపై గవర్నర్ మాట్లాడకపోతే నిరసనలను తీవ్రతరం చేస్తామని సభలో గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు.

మరోవైపు, గవర్నర్ అవినీతిపరుడంటూ గత సోమవారం మమతా బెనర్జీ ఆరోపించారు. జైన్ హవాలా కేసులో ధన్కర్ పేరు ఉందని ఆమె విమర్శించారు. ఆయనపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేసిందని... ఇప్పటికీ ఒక పిల్ ఉన్నప్పటికీ, దాన్ని పెండింగ్ లో పెట్టారని అన్నారు.

రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తన ప్రభుత్వం అని సంబోధిస్తూ గవర్నర్ ప్రసంగించడం తెలిసిందే.


More Telugu News