ఒకరు బనియన్​ తో.. మరొకరు ఫేస్​ ప్యాక్​ తోనా.. వర్చువల్​ వాదనల్లో అడ్వొకేట్ల పద్ధతిపై అలహాబాద్​ హైకోర్టు సీరియస్​

  • డ్రెస్ కోడ్ ను విధించిన న్యాయమూర్తి
  • మగవారు తెల్లచొక్కా.. మహిళలు చీరలోనే హాజరు కావాలి
  • నల్లకోటు ధరిస్తే ఇంకా మంచిది
  • ఇకపై నిర్లక్ష్య వైఖరిని సహించబోం
వారంతా అత్యున్నత స్థానంలో ఉన్న హైకోర్టు అడ్వొకేట్లు. కానీ, విధుల్లో వ్యవహరించాల్సిన తీరును వారు మరచిపోయారు. ఒకరు బనియన్ లో కేసు విచారణకు హాజరైతే.. మరొకరు ఫేస్ ప్యాక్ వేసుకుని న్యాయమూర్తి ముందు దర్శనమిచ్చారు.. ఇంకో న్యాయవాదేమో స్కూటర్ మీద వెళ్తూ వాదనలు వినిపించారు. అలహాబాద్ హైకోర్టు ఆన్ లైన్ విచారణల సందర్భంగా ఆయా న్యాయవాదుల తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. డ్రెస్ కోడ్ ను విధించారు.

‘‘అడ్వొకేట్లు విచారణలకు వచ్చే పద్ధతి ఇదేనా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇలాంటి ప్రవర్తన అస్సలు సరికాదు. ఇంట్లో ఉన్నా.. ఆఫీసులో ఉన్నా లేదా కోర్టు రూంలో ఆన్ లైన్ విచారణలకు హాజరైనా నిబద్ధతతో వ్యవహరించాల్సిందే. కోర్టుకు ఎలాగైతే వస్తారో అలాగే ఆన్ లైన్ విచారణకూ హాజరవ్వాలి. క్రమశిక్షణను పాటించాలి’’ అంటూ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.

ఇక నుంచి ఆన్ లైన్ లో విచారణలకు హాజరయ్యేటప్పుడు కచ్చితంగా ఫార్మల్ దుస్తులనే ధరించాలని ఆదేశించారు. తెల్ల చొక్కా లేదా తెల్ల సల్వార్ కమీజ్, మహిళా అడ్వొకేట్లయితే చీర, తెల్లటి నెక్ బ్యాండ్ తో విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. నల్ల కోటు ధరిస్తే ఇంకా మంచిదన్నారు. విచారణలు జరిగేటప్పుడు చుట్టుపక్కల ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు.

‘‘ఇవ్వాళ ఓ అడ్వొకేట్.. రంగుల పూలచొక్కా వేసుకొచ్చారు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదు. అయినా మేం ఆయనపై ఎలాంటి చర్యలను తీసుకోలేదు’’ అని అన్నారు. ఇకనుంచి ఎవరైనా క్రమశిక్షణ లేకుండా క్యాజువల్ గా వస్తామంటే సహించబోమని హెచ్చరించారు. దీనిపై అడ్వొకేట్లందరికీ హైకోర్టు బార్ అసోసియేషన్ సూచనలివ్వాలని పేర్కొన్నారు.


More Telugu News