నల్గొండ జిల్లాలో దారుణం.. కరోనా టీకాకు బదులు రేబిస్ టీకా ఇచ్చిన నర్సు!

  • ఒకే సిరంజితో ఇద్దరికి టీకాలు
  • ఒక భవనంలోకి బదులు మరో భవనంలోకి వెళ్లడంతో పొరపాటు
  • ఆమెకు ఇచ్చింది రేబిస్ వ్యాక్సిన్ కాదన్న మండల వైద్యాధికారి
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కరోనా టీకా వేయించుకునేందుకు వెళ్లిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి నర్సు రేబిస్ టీకా ఇవ్వడం కలకలం రేగింది. కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల పాఠశాల హెచ్ఎం ఇచ్చిన లేఖ తీసుకుని కరోనా టీకా వేయించుకునేందుకు నిన్న ఉదయం 11 గంటలకు కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లింది. ఇక్కడి పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా, పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు.

విషయం తెలియని ప్రమీల పీహెచ్‌సీకి వెళ్లింది. అక్కడ ఉన్న నర్సు అప్పటికే ఓ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయగా, అదే సమయంలో వెళ్లిన ప్రమీలకు కూడా అదే సిరంజితో రేబిస్ టీకా ఇచ్చింది. కొవిడ్ టీకా ఇవ్వాలంటూ టీచర్ ఇచ్చిన లేఖ చూడకుండా తనకు అంతకుముందు ఉపయోగించిన సిరంజితోనే టీకా వేసిందని ప్రమీల ఆరోపించింది.

ఒకే సిరంజితో ఇద్దరికి ఎలా వేస్తారని ప్రశ్నిస్తే నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొంది. బాధితురాలు కొవిడ్ టీకా బ్లాక్‌లోకి వెళ్లకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లడం వల్లే ఈ పొరపాటు జరిగిందని మండల వైద్యాధికారి తెలిపారు. నిజానికి ఆమెకు వేసింది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కాదని, టీటీ ఇంజక్షన్ మాత్రమేనని, దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదని పేర్కొన్నారు.


More Telugu News