పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ మోదీకి 6 వేల మంది సీఏ విద్యార్థుల లేఖ

  • కరోనా నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని కోరిన విద్యార్థులు
  • విద్యార్థులందరూ వ్యాక్సిన్ వేయించుకున్నాక పరీక్షలు నిర్వహించాలని విన్నపం
  • ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే ప్రాణ హాని జరిగే అవకాశం ఉందని ఆందోళన
కరోనా నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ 6 వేల మంది విద్యార్థులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. జులై 5 నుంచి 20వ తేదీ వరకు సీఏ ఇంటర్, ఫైనల్స్ పరీక్షలను నిర్వహించేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానికి విద్యార్థులు లేఖ రాశారు. మరోవైపు ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ వాదనలను ఈరోజు సుప్రీంకోర్టు వినబోతోంది.

కరోనా నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని ప్రధానిని కోరుతున్నామని లేఖలో విద్యార్థులు తెలిపారు. ఇప్పడు పరీక్షలను నిర్వహిస్తే ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత పరీక్షలను నిర్వహిస్తే విద్యార్థలు భయం లేకుండా పరీక్షలను రాయగలుగుతారని తెలిపారు. పరీక్షలను రద్దు చేయాలని తాము కోరడం లేదని అన్నారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 18 నుంచి 23 ఏళ్ల వయసువారని... అందరూ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత పరీక్షలను నిర్వహించాలని కోరారు. పరీక్షలను కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తే దాదాపు 3 లక్షల మంది సీఏ విద్యార్థులు వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న విద్యార్థులకు సెల్ఫ్ డిక్లరేషన్ పై ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రయాణించడానికి వీలుగా అడ్మిట్ కార్డునే ఈ పాస్ గా గుర్తించాలని విన్నవించారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు వసతి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.


More Telugu News