హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరు: ఈటల

  • హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఈటల
  • మంత్రులు, ఎమ్మెల్యేలు మాయమాటలు చెబుతున్నారన్న రాజేందర్   
  • ఈటల లేకుంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడన్న జితేందర్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్‌లో నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ పట్టణ, మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో రాజేందర్ మాట్లాడారు. కేసీఆర్ అణచివేత ధోరణికి అంతం పలకడమే ఏకైక అజెండాగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

 కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నదే హుజూరాబాద్ ఉప ఎన్నిక అని అభివర్ణించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామని, గ్రామానికి రూ. 50 లక్షలు, కోటి రూపాయలు ఇస్తామని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పాలన కావాలో, గడీల పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రజలకు సూచించారు.


More Telugu News