ఐదో రోజూ అదే తీరు... డబ్ల్యూటీసీ ఫైనల్ కు వర్షం అడ్డంకి

  • భారత్, కివీస్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్
  • సౌతాంప్టన్ లో మళ్లీ వర్షం
  • ఇప్పటికే రెండ్రోజుల ఆట వర్షార్పణం
  • వర్షం తగ్గితేనే మ్యాచ్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ లో జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ను వరుణుడు వీడేట్టు కనిపించడంలేదు. తొలి రోజు ఆటతో పాటు, నాలుగో రోజు ఆటను కూడా పూర్తిగా మింగేసిన వరుణుడు... ఇవాళ ఐదో రోజు ఆట ప్రారంభంపైనా ప్రభావం చూపించాడు. సౌతాంప్టన్ లో మరోసారి వర్షం పడుతుండడంతో ఆట ప్రారంభం ఆలస్యం కానుంది. పిచ్ పై కవర్లు ఇంకా కప్పి ఉంచారు. క్రికెట్ ప్రపంచం అంతా ఎంతో ఆసక్తి చూపిస్తున్న ఈ మ్యాచ్ ఇలా వర్షం కారణంగా నిస్సారంగా మారడం అభిమానులకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులకు ఆలౌటైంది. ఆపై కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 101 పరుగులు చేయగా, వెలుతురు లేమితో ఆట నిలిచిపోయింది. అప్పటికి ఆ జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది.

ఈ క్రమంలో నాలుగో రోజు ఆట వర్షంతో తుడిచిపెట్టుకుపోగా, ఇవాళ ఐదో రోజు ఆటపైనా అదే అనిశ్చితి నెలకొంది. రేపు ఆరో రోజు ఆటకు రిజర్వ్ డేగా ఉన్నప్పటికీ, వరుణుడి జోరు నేపథ్యంలో ఫలితం రావడం కష్టమేననిపిస్తోంది.


More Telugu News