విజయసాయి మతిభ్రమించి మాట్లాడుతున్నారు: వడ్డే శోభనాద్రీశ్వరరావు

  • అశోక్ గజపతిరాజు జైలుకు వెళ్తారన్న విజయసాయి
  • విజయసాయి 15 నెలలు జైల్లో ఉండొచ్చారన్న శోభనాద్రీశ్వరరావు
  • వేలాది ఎకరాలు దానం చేసిన చరిత్ర అశోక్ రాజు కుటుంబానిదని వ్యాఖ్య
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. విజయసాయికి మతి భ్రమించిందని అన్నారు. ఏ రోజైనా అశోక్ గజపతిరాజు జైలుకు వెళ్తారంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలను గమనిస్తే... ఆయన మతి స్థిమితం కోల్పోయారనే విషయం అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.

అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న విజయసాయి ఇప్పటికే 15 నెలలు జైల్లో ఉండొచ్చారని, చాలా కాలంగా బెయిల్ పై ఉన్నారని చెప్పారు. ఏదో రోజు ఆయన బెయిల్ రద్దవుతుందని... అప్పుడు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని అన్నారు.

వేలాది ఎకరాలను దేవాలయాలకు, ధార్మిక సంస్థలకు దానం చేసిన చరిత్ర అశోక్ రాజు కుటుంబానిదని శోభనాద్రీశ్వరరావు చెప్పారు. ఆంధ్రా యూనివర్శిటీకి 600 ఎకరాలు దానం చేశారని తెలిపారు. అశోక్ రాజును విమర్శించే స్థాయి విజయసాయికి లేదని వ్యాఖ్యానించారు.


More Telugu News