ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌!

  • ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు
  • బ‌కాయిల‌ను వెంటనే చెల్లించాలి
  • మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో స‌ర్కారు విఫలం
  • రెండు నెలలు దాటినా న‌గ‌దు జ‌మ చేయ‌ట్లేరు
ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. బ‌కాయిల‌ను వెంటనే చెల్లించాలని కోరారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో స‌ర్కారు విఫలమైందన్నారు.

త‌మ‌ది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటోన్న వైసీపీ సర్కారు రైతుల‌కు న‌ష్టం తెచ్చిపెట్టే విధానాలను అవలంబిస్తోంద‌ని విమ‌ర్శించారు. తాము అధికారంలో ఉన్న స‌మ‌యంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే వారిమ‌ని చెప్పారు.

ఇప్పుడు మాత్రం ధాన్యం కొనుగోళ్లు చేసి రెండు నెలలు దాటినా జ‌మ చేయ‌ట్లేదని పేర్కొన్నారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ.2500 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయ‌న విమ‌ర్శించారు.

రాయలసీమలో వేరు శనగ పంట నష్టపోయినా పెట్టుబడి రాయితీ అందలేదని తెలిపారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సాయం అందడం లేదన్నారు. ఏపీలో మిల్లర్లు, వైసీపీ నాయకులు క‌లిసి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.


More Telugu News