శ్రీలంక టూర్లో పాల్గొనే భారత జట్టుకు ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్

  • జులైలో శ్రీలంకలో భారత జట్టు పర్యటన
  • అదే సమయంలో ఇంగ్లండ్ టూర్లో కోహ్లీ సేన
  • మరో జట్టును లంకకు పంపుతున్న బీసీసీఐ
  • లంక టూర్లో వన్డే, టీ20 సిరీస్ లు ఆడనున్న భారత్
భారత జట్టు బిజీ షెడ్యూల్ కారణంగా ఏకకాలంలో రెండు విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తోంది. జూన్ 18 నుంచి ఇంగ్లండ్ లో న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్, ఆపై ఇంగ్లండ్ జట్టుతో 5 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అదే సమయంలో శ్రీలంకలో వన్డే, టీ20 సిరీస్ ల్లోనూ పాల్గొనాలి.

 అయితే, ఇంగ్లండ్ టూర్ కు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ప్రధాన జట్టును పంపుతున్న బీసీసీఐ... శ్రీలంక టూర్ కు అందుబాటులో ఉన్న ప్రతిభావంతులతో మరో భారత జట్టును పంపిస్తోంది. ఇంగ్లండ్ వెళ్లే భారత జట్టుకు రవిశాస్త్రి కోచ్ కాగా, శ్రీలంక టూర్లో పాల్గొనే భారత జట్టుకు తాజాగా రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా నియమించింది. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి సమాచారం అందించారు.

శ్రీలంకలో జూలైలో జరిగే ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లకు శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య, శ్రేయాస్ అయ్యర్ మధ్య కెప్టెన్సీ కోసం పోరు నెలకొంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు 3 వన్డేలు, పలు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. జూనియర్ స్థాయిలో కోచ్ గా సత్తా చాటిన రాహుల్ ద్రావిడ్ సీనియర్ జట్టుకు ఎలా దిశానిర్దేశం చేస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాక ద్రావిడ్ భారత అండర్-19 జట్లను సానబట్టడంలో నిమగ్నమయ్యాడు. ద్రావిడ్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు.


More Telugu News