ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధినేతగా పనిచేసిన డా.అగర్వాల్ కరోనాతో మృతి!

  • భారత వైద్య రంగంలో కీర్తిగాంచిన డాక్టర్ కేకే అగర్వాల్
  • నిన్న రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ లో మృతి
  • గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న అగర్వాల్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ చీఫ్ గా బాధ్యతలను నిర్వర్తించిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కేకే అగర్వాల్ కరోనా కాటుకు బలయ్యారు. భారత వైద్య రంగంలో ఎంతో పేరు, ప్రతిష్టలను కలిగిన ఆయన చివరకు కరోనాతో మృతి చెందడం అందరినీ కలచి వేస్తోంది. కరోనా బారిన పడిన ఆయన గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్నారు. ఆరోగ్యం విషమించి నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ అగర్వాల్ వయసు 62 ఏళ్లు.

ఆయన మరణం గురించి ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటన వెలువడింది. నిన్న రాత్రి 11.30 గంటలకు ఆయన మృతి చెందారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనాతో సుదీర్ఘ పోరాటం చేసి తుదిశ్వాస విడిచారని వెల్లడించారు. ఆయన డాక్టర్ అయినప్పటి నుంచి సమాజం కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు.

మన దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆయన నిరంతరం తన వంతు కృషి చేశారని ట్వీట్ లో తెలిపారు. ఎన్నో వీడియోల ద్వారా కనీసం 10 కోట్ల మందికి చేరేలా కార్యక్రమాలు చేపట్టి, ఎందరో జీవితాలను కాపాడారని చెప్పారు. తన మరణం పట్ల ఎవరూ బాధ పడకూడదని... ఒక వేడుకలా చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు.

అంతులేని ఆయన స్ఫూర్తి, కృషిని అందరూ గుర్తుంచుకుందామని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అందరం ప్రార్థిద్దామని తెలిపారు. మరోవైపు, ఆయన మృతి పట్ల ఎందరో ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.


More Telugu News