దేశంలో 5జీ ట్రయల్స్‌ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి!

  • దేశవ్యాప్తంగా ట్రయల్స్‌ ప్రారంభించనున్న ప్రముఖ టెలికాం సంస్థలు
  • ఎరిక్సన్‌, నోకియా, శాంసంగ్‌, సీడాట్‌, జియో సాంకేతికత మాత్రమే వాడాలని ఆదేశం
  • చైనా కంపెనీలకు దక్కని చోటు
  • 6నెలల పాటు ట్రయల్స్ నిర్వహణ
దేశంలో 5జీ ట్రయల్స్‌ నిర్వహణకు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లకు(టీఎస్‌పీ) టెలికాం మంత్రిత్వశాఖ మంగళవారం అనుమతి ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా, ఎంటీఎన్‌లు 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించనున్నాయి.

ఈ ట్రయల్స్‌లో ఎరిక్సన్‌, నోకియా, శాంసంగ్‌, సీ-డాట్‌తో పాటు రిలయన్స్‌ జియో దేశీయంగా అభివృద్ధి చేసుకున్న సాంకేతికతను మాత్రమే వినియోగించాలని టెలికాం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంట్లో ఏ ఒక్క చైనా సంస్థ లేకపోవడం గమనార్హం.

చైనాకు చెందిన హువావే సాంకేతికతను వినియోగిస్తామని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు తొలుత పేర్కొన్నాయి. కానీ చివరకు సమర్పించిన దరఖాస్తులో మాత్రం చైనా కంపెనీల నుంచి ఎటువంటి సాంకేతికతను తీసుకోబోమని తెలిపాయి. ఈ  ట్రయల్స్‌ను ఆరు నెలల పాటు నిర్వహించాల్సి ఉంటుంది.


More Telugu News