పెళ్లి మంటపంలో దౌర్జన్యం చేసిన కలెక్టర్... విధుల నుంచి తప్పించిన త్రిపుర ప్రభుత్వం

  • త్రిపురలో ఓ కలెక్టర్ అత్యుత్సాహం
  • పెళ్లి వేడుకలో వీరంగం
  • అనుమతి ఉందన్నా గానీ పెళ్లి మంటపంపై దాడి
  • పెళ్లికొడుకుపైనా, పురోహితుడిపైనా చేయిచేసుకున్న వైనం
  • కలెక్టర్ పై సీఎం విప్లవ్ దేవ్ ఆగ్రహం
ఇటీవల త్రిపురలో ఓ పెళ్లి జరుగుతుండగా, జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్ రంగప్రవేశం నానా రభస సృష్టించడం తెలిసిందే. వెస్ట్ త్రిపుర జిల్లా కలెక్టర్ శైలేష్ కుమార్ యాదవ్ కరోనా నియమనిబంధనల పేరిట వధూవరులపై కేసు బుక్ చేయడమే కాదు, పలువురిపై చేయి చేసుకున్నారు. తమకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందంటూ అనుమతి పత్రాన్ని చూపిన ఓ మహిళపై శైలేష్ కుమార్ ప్రవర్తించిన తీరు వీడియోలో రికార్డ్ అయింది. ఆ పత్రాన్ని చించి ముక్కలు చేసిన ఆయన అహంకార పూరితంగా గాల్లోకి విసిరివేశారు. పెళ్లికొడుకును, పురోహితుడ్ని కొట్టడం శైలేష్ కుమార్ దుందుడుకు స్వభావానికి పరాకాష్టగా నిలిచింది.

దీనిపై త్రిపుర ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. సీఎం విప్లవ్ దేవ్ విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయ్యేవరకు విధుల్లో కొనసాగరాదంటూ శైలేష్ కుమార్ ను బాధ్యతల నుంచి తప్పించారు. కాగా, శైలేష్ కుమారే తనను విధుల నుంచి తప్పించాలని కోరారని న్యాయశాఖ మంత్రి రతన్ లాల్ వెల్లడించారు. విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారని మంత్రి వివరించారు.


More Telugu News