అద్దె చెల్లించలేదని గెంటేసిన ఓనర్... రోడ్డుపై తమిళ నటి!

  • మూడు నెలలుగా అద్దె చెల్లించని నటి విజయలక్ష్మి
  • ఇంటికి వెళ్లేసరికి మరో వ్యక్తి కనిపించడంతో అవాక్కు
  • తాత్కాలిక ప్రత్యామ్నాయాన్ని చూపించిన పోలీసులు
తమిళ నటి విజయలక్ష్మి, తానుంటున్న ఇంటి అద్దెను చెల్లించలేదన్న కారణంతో, ప్లాట్ మేనేజర్ ఆమె సామాన్లు బయట పడవేయడంతో, రోడ్డుపై ఆమె నానాయాగీ చేశారు. చివరకు పోలీసులు కల్పించుకుని ఆమెకు మరో చోట తాత్కాలిక ఆశ్రయాన్ని కల్పించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయమై మరిన్ని వివరాల్లోకి వెళితే, గతంలో విజయలక్ష్మి, దర్శకుడు, నటుడు, నామ్ తమిళర్ కట్చి పార్టీ నేత సీమాన్ పై సంచలన విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కింది. ఆపై పలుమార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేసింది.

ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. ఇలా సినిమా కష్టాల్లో ఆమె కొట్టుమిట్టాడుతూ, టీ-నగర్ ప్రాంతంలోని ఓ సర్వీసు అపార్టుమెంట్ లో చెల్లెలితో కలిసి ఉంటోంది. ఆమె సోదరికి అనారోగ్యం కలగడంతో, ఆమెతో పాటు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్న విజయలక్ష్మి, డిశ్చార్జ్ తరువాత ప్లాట్ కు వచ్చి అవాక్కైంది. తన ప్లాట్ లో మరో వ్యక్తి ఉండటాన్ని చూసి ఓనర్ కు ఫోన్ చేయగా, మూడు నెలలుగా అద్దె చెల్లించని కారణంగా మరో వ్యక్తికి ఇంటిని ఇచ్చామన్న సమాధానం వచ్చింది.

దీంతో మీడియాను పిలిచి, తనను రోడ్డున పడేశారంటూ గొడవ మొదలు పెట్టిన ఆమె, నానా రభస చేసింది. ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చిన మేనేజర్, విజయలక్ష్మి సామాన్లను తామేమీ బయట పడేయలేదని, ఓ గదిలో ఉంచామని, ప్లాట్ సిబ్బందిని కొట్టడంతో పాటు, అద్దె చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

టీ-నగర్ రోడ్లపై విజయలక్ష్మి వ్యవహారం ముదురుతూ ఉండటంతో పోలీసులు కల్పించుకోవాల్సి వచ్చింది. విజయలక్ష్మి వద్దకు వచ్చిన తేనాంపేట పోలీసులు, ఆమెతో మాట్లాడి, టెంపరరీగా మరో ప్రాంతంలో ఆశ్రయం కల్పించారు. కాగా, నిన్న మొన్నటి వరకూ సీమాన్ ను దుమ్మెత్తి పోసిన ఆమె, తాజాగా, తనను ఆదుకోవాలని ఆయన్నే కోరుతుండటం గమనార్హం.


More Telugu News