గాంధీ, కింగ్ కోఠి ఆసుపత్రుల్లో కొవిడ్ వార్డులను సందర్శించిన కిషన్ రెడ్డి

  • హైదరాబాదులో కిషన్ రెడ్డి పర్యటన
  • గాంధీ, కింగ్ కోఠి ఆసుపత్రుల్లో ఏర్పాట్ల పరిశీలన
  • కొవిడ్ చికిత్స గురించి ఆరా
  • మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
  • ఆక్సిజన్ కొరత లేదని వెల్లడి
కరోనా రోగులకు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడంలేదని, ఆక్సిజన్ సౌకర్యం అందడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాదులో కింగ్ కోఠి, గాంధీ ఆసుపత్రులను సందర్శించారు. అక్కడ కొవిడ్ పేషెంట్లకు అందుతున్న చికిత్సను ప్రత్యక్షంగా గమనించారు. ఆసుపత్రుల అధికారులను అడిగి కొవిడ్ వార్డుల్లో ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఆయన తన సందర్శన వివరాలు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో బెడ్లకు కొరతలేదని, కింగ్ కోఠి ఆసుపత్రిలోనూ ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. ఆక్సిజన్ కొరత లేదని తెలిపారు. కొవిడ్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ కోటా పెంచమని కేంద్ర ప్రభుత్వంతో చెప్పానని అన్నారు.


More Telugu News