మున్సిపల్ ఎన్నికలు వాయిదా కోరుతూ షబ్బీర్ అలీ పిటిషన్... నిలిపివేత ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు!
- ఈ నెల 30న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
- హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ సీనియర్ నేత
- ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైందన్న న్యాయస్థానం
- తదుపరి విచారణ జూన్ 7కి వాయిదా
తెలంగాణలో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం ఎస్ఈసీ, తెలంగాణ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ అభ్యర్థనను ఎన్నికల సంఘం పరిశీలించాలని స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినందున, ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని ఎస్ఈసీనే నిర్ణయిస్తుందని వెల్లడించింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను జూన్ 7కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.