ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వ నిర్ణయం

  • వివేకా హత్యకేసులో సీబీఐకి లేఖ రాసిన ఏబీ
  • డీజీపీ, ఇతర పోలీసు అధికారులపై వ్యాఖ్యలు
  • తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం
  • విచారణ బహిర్గతం చేసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల వైఎస్ వివేకా హత్య కేసులో డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులపై వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే పోలీసు విభాగం ఘాటుగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఏబీ వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. విచారణను బహిర్గతం చేసేలా ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొంది. 30 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఆదేశించింది. వివేకా హత్యకేసులో ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల సీబీఐకి లేఖ రాశారు. తన లేఖలో డీజీపీపైనా, ఇతర పోలీసు అధికారులపైనా వ్యాఖ్యలు చేశారు. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.


More Telugu News