రెండు నెలల పాటు సభలు, వేడుకలపై ఆంక్షలు పెట్టాల్సిందే: లాన్సెట్​ ఇండియా కొవిడ్​ టాస్క్​ ఫోర్స్

  • వాటితోనే కరోనా పెరుగుతోందని కామెంట్
  • 10 మంది మించి గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని సూచన
  • థియేటర్లు, క్రీడా మైదానాలను మూసేయాలని సిఫార్సు
రెండు నెలల పాటు ప్రజలెవరూ గుమికూడకుండా ఆంక్షలు పెట్టాలని 'లాన్సెట్ కొవిడ్ 19 కమిషన్' ఇండియా టాస్క్ ఫోర్స్ సూచనలు చేసింది. ఎన్నికల ప్రచార సభలు, ఆధ్యాత్మిక సమావేశాలు, మత కార్యక్రమాలు, పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు, క్రీడల వల్లే కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయని, వాటిపై ఆంక్షలు విధిస్తే మహమ్మారి వ్యాప్తిని తగ్గించవచ్చని సూచిస్తూ నివేదిక విడుదల చేసింది.

10 మంది కన్నా ఎక్కువ గుమికూడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఎన్నికల సభలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టలేదని, వాటిపై నిషేధం విధించలేదని గుర్తు చేసింది. దీంతో జనాలు గుంపులుగా చేరుతున్నారని, వాటితో కరోనా సోకుతోందని పేర్కొంది. ఇటు కుంభమేళా వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఎవరూ కరోనా నిబంధనలను పట్టించుకోలేదని, దాని వల్లా కేసులు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఏపీలో నిర్వహించిన ‘పిడకల సమరం’లోనూ జనాలు గుమికూడారని పేర్కొంది.

కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు జనాలు గుమికూడకుండా పరిమితులు విధించాలని సూచించింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. అలాంటి కార్యక్రమాలకు హాజరై తిరిగి వచ్చే జనాలపై కొంచెం దృష్టి పెట్టాలని, వారు వెళ్లే ప్రాంతాలు, జిల్లాల్లో నిఘా పెట్టాలని సూచించింది.

థియేటర్లు, క్రీడా మైదానాలు, స్టేడియాలు, ఇండోర్ స్టేడియాలను మూసేయాలని తేల్చి చెప్పింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా కరోనా నిబంధనలను పాటించాలని, అప్పుడే కరోనాను అరికట్టగలుగుతామని లాన్సెట్ భారత కొవిడ్ టాస్క్ ఫోర్స్ పేర్కొంది.


More Telugu News