టీడీపీ సీనియర్ నేత నరసింహారావు కన్నుమూత.. చంద్రబాబు దిగ్భ్రాంతి

  • ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన నరసింహారావు
  • కరోనా లక్షణాలతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిక
  • మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆయనకు పెద్దల్లుడు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు కన్నుమూశారు. ఆయన వయసు 70  సంవత్సరాలు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన నరసింహారావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తెను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వివాహం చేసుకున్నారు.

కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలానికి చెందిన నరసింహారావు మచిలీపట్టణంలో స్థిరపడ్డారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న నరసింహారావు 1999 ఎన్నికల్లో మచిలీపట్టణం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.

ఇటీవల కరోనా లక్షణాలతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. నేడు మచిలీపట్టణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నరసింహారావు మృతి విషయం తెలిసి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అల్లుడు కొల్లు రవీంద్రను ఫోన్‌లో పరామర్శించారు.


More Telugu News