మోదీకి గడ్డాలు పెంచడం, స్టేడియాలకు పేర్లు పెట్టుకోవడం మాత్రమే తెలుసు.. ప్రధానిపై మమత ఫైర్‌

  • పోలింగ్‌ సమీపిస్తున్న వేళ రసవత్తంగా సాగుతున్న ప్రచారం
  • హోంమంత్రిపైనా దీదీ ఫైర్‌
  • మోదీ మెదడులో ఏదో సమస్యంటూ ఘాటు వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ సమీపించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గడ్డాలు పెంచడం, స్టేడియాల పేర్లు మార్చడమే తప్ప దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం రాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై కూడా దీదీ విమర్శలు గుప్పించారు.

‘‘ఒక్కోసారి.. గాంధీజీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కంటే తానే గొప్ప వాడినని భావిస్తారు. మరోసారి తనను తాను స్వామి వివేకానంద అని చెప్పుకుంటారు. మైదానాలకు తన పేరు పెట్టుకుంటారు. ఏదో ఒకరోజు దేశానికే తన పేరు పెట్టుకుని, అమ్మేసినా అమ్మేస్తారు. నాకెందుకో వారి మెదడులోనే ఏదో సమస్య ఉందని అనిపిస్తుంది’’ అంటూ మోదీపై దీదీ ఘాటు విమర్శలు చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో 8 విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. మార్చి 27న తొలి విడత పోలింగ్‌ జరుగనుండగా.. ఏప్రిల్‌ 29న తుది విడత పోలింగ్‌ జరగనుంది.


More Telugu News