మమత ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదు: ఎన్నికల కమిషన్

  • ఈసీ, అమిత్ షాలపై నిన్న తీవ్ర విమర్శలు గుప్పించిన మమత
  • ఈసీని అమిత్ షా నడిపిస్తున్నారా? అని మండిపాటు
  • మమత వ్యాఖ్యలు దురదృష్టకరమన్న డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ జైన్
మన దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతం అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, అన్ని రాష్ట్రాల కంటే పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఎక్కువ ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రచారపర్వంలో ఎన్నో నాటకీయ, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార టీఎంసీ, బీజేపీ పార్టీల మధ్య పోటీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని పుట్టించాయి.

'ఎన్నికల కమిషన్ ను నేను ఒక్కటే అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ ను ఎవరు నడిపిస్తున్నారు. అమిత్ షా నడిపిస్తున్నారా? లేక కమిషన్ నడిపిస్తోందా? మేము ప్రశాంతమైన, పారదర్శకమైన ఎన్నికలను కోరుకుంటున్నాం. ఎవరు అమిత్ షా? ఎన్నికల కమిషన్ ను నిర్దేశించేందుకు ఆయనెవరు? ఎన్నికల కమిషన్ విధుల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారు. మాకు వ్యతిరేకంగా పని చేయిస్తున్నారు. నా సెక్యూరిటీ ఇన్చార్జిని కూడా తొలగించారు. వాళ్లకు ఏం కావాలి? వాళ్లు నన్ను చంపాలనుకుంటున్నారా?' అంటూ ఎలక్షన్ కమిషన్ ను, అమిత్ షాను ఉద్దేశించి మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంకురాలో నిన్న నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు.

మమత చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సందీప్ జైన్ ఒక లేఖ ద్వారా తమ స్పందనను తెలియజేశారు. ముఖ్యమంత్రి మమత చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆమె ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ర్యాలీలో మమత మాట్లాడిన మాటలను మీడియాలో తాము చూశామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఏ ఒక్క పార్టీకో, వ్యక్తికో అనుకూలంగా వ్యవహరించదని చెప్పారు. పూర్తి పారదర్శకతతో విధులను నిర్వహిస్తుందని చెప్పారు.


More Telugu News