త‌మిళ‌నాడులో ఊపందుకున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ ప్ర‌చారం.. ప్ర‌భుత్వంపై రాహుల్, స్టాలిన్ ధ్వ‌జం

  • కేంద్ర ప్ర‌భుత్వం త‌మిళ‌నాడు సంస్కృతిని గౌర‌వించ‌దు
  • వారి ప్ర‌తినిధిలా ఇక్కడి ముఖ్య‌మంత్రి ఉన్నారు
  • కేంద్రం ఏం చెబితే అది ఆయ‌న‌ చేస్తారు: రాహుల్ 
  • రెండు నెల‌ల్లో త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వం మార‌నుంది: స‌్టాలిన్
త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు ప్ర‌చారం ర్యాలీల్లో భాగంగా క‌న్యాకుమారిలో రోడ్‌షోలో పాల్గొని కేంద్ర‌, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

'కేంద్ర ప్ర‌భుత్వం త‌మిళ‌నాడు సంస్కృతిని గౌర‌వించ‌దు. ఇక్క‌డ వారి ప్ర‌తినిధిలా ముఖ్య‌మంత్రి ఈకే ప‌ళ‌నిస్వామి ఉన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏం చెబితే దాన్ని ఆయ‌న‌ చేస్తారు. ఆయ‌న రాష్ట్రానికి ప్రాత‌నిధ్యం వ‌హించ‌రు. మోదీకి ప్ర‌తినిధిగా ఉంటూ ఆయ‌న ఏం చెబితే అది చేస్తారు. మోదీ ముందు త‌లవంచే వారు త‌మిళ‌నాడుకు ప్రాతినిధ్యం వ‌హించలేరు' అని రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు.
 
'త‌మిళ సంస్కృతిని ఆర్ఎస్ఎస్ అవ‌మానించే అవ‌కాశాన్ని ముఖ్య‌మంత్రి ఇవ్వ‌కూడ‌దు. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చ‌రిత్ర అని మోదీ అంటారు. మ‌రి త‌మిళం భార‌తీయ భాష కాదా? త‌మిళ చ‌రిత్ర భార‌త చ‌రిత్ర కాదా? ఒక భార‌తీయుడిగా త‌మిళ సంస్కృతిని కాపాడ‌డం నా విధి' అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

కాగా, ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా త‌మిళ‌నాడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 'రెండు నెల‌ల్లో త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వం మార‌నుంది. ప్ర‌జ‌లు కూడా చాలా ఆత్రుత‌గా దీని కోస‌మే ఎదురు చూస్తున్నారు. త‌దుప‌రి 10 సంవ‌త్స‌రాల్లో త‌మిళ‌నాడును పురోగమించిన (అడ్వాన్స్‌డ్‌) రాష్ట్రంగా తీర్చిదిద్దాల‌ని ప్ర‌ణాళిక వేసుకున్నాం. అధికారంలో ఉండాల‌న్న ల‌క్ష్యంతో కాకుండా ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మే డీఎంకే ప‌ని చేస్తోంది' అని స్టాలిన్ చెప్పారు.


More Telugu News