బొమ్మల్లో ప్లాస్టిక్​ తగ్గించండి: ప్రధాని మోదీ

  • దేశంలోనే మొదటి టాయ్ ఫెయిర్ ప్రారంభం
  • పునర్వినియోగం– పునరుత్పాదన ఫార్ములాను అనుసరించాలని సూచన
  • పరిశ్రమ అభివృద్ధికి ఏవైనా సలహాలు ఇవ్వాలని పిలుపు
పిల్లలు ఆడుకునే బొమ్మల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. భారత దేశ సంస్కృతి అయిన ‘పునర్వినియోగం (రీయూజ్) పునరుత్పాదన (రీసైకిల్)’లను భారత బొమ్మల పరిశ్రమ అమలు చేయాలని పిలుపునిచ్చారు. భారత జీవన విధానానికి తగ్గట్టు రీసైకిల్ చేయగల పదార్థాలనే బొమ్మలకు వాడాలని సూచించారు. శనివారం ఆయన దేశంలోనే మొట్టమొదటి టాయ్ ఫెయిర్ ను ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న బొమ్మల తయారీదార్లతో మమేకమయ్యారు.

దేశంలో ఎక్కువగా సహజసిద్ధమైన, సురక్షితమైన పదార్థాలు, రంగులతోనే బొమ్మలను తయారు చేసేవారని మోదీ గుర్తు చేశారు. దేశంలో బొమ్మల పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు ఏవైనా నూతన ఆలోచనలు చేయాల్సిందిగా ఉత్పత్తిదారులకు సూచించారు. ఈ రంగంలోని భాగస్వాములందరినీ ఏకతాటిపైకి తెస్తామని, దాని వల్ల పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని అన్నారు. 200 ఏళ్లుగా బొమ్మల తయారీలో నిపుణులైన కర్ణాటకలోని చెన్నపట్నానికి చెందిన బొమ్మల ఉత్పత్తిదారులతో ఆయన మాట్లాడారు.

కాగా, టాయ్ ఫెయిర్ ను ఐదు దశలుగా విభజించారు. ప్రీ స్కూల్ నుంచి రెండో తరగతి, ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ, సీనియర్ సెకండరీ విభాగాలుగా చేశారు. మార్చి 2 దాకా ఈ కార్యక్రమం జరగనుంది. ఐఐటీ గాంధీ నగర్ కు చెందిన సెంటర్ ఫర్ క్రియేటివ్ లెర్నింగ్ 200 రకాల బొమ్మలను తయారు చేసింది. ఉత్సవంలో వాటిని ప్రదర్శించింది.


More Telugu News