పుజారాకు గాయం.. ఫీల్డ్​ లోకి రాని వాల్​ 2.0

  • నొప్పి వేధిస్తోందని బీసీసీఐ ప్రకటన
  • గాయం తీవ్రతపై ఎలాంటి ప్రకటన చేయని బీసీసీఐ
  • అతడి స్థానంలో రిజర్వ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఫీల్డింగ్
టీమిండియాకు గాయాల బెడద తప్పట్లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో ప్రధాన ఆటగాళ్లంతా గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. మొత్తం యువ ఆటగాళ్లతోనే టీమిండియా ఆస్ట్రేలియాలో సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లోనూ గాయాల బెడద మొదలైంది. టీమిండియా వాల్ 2.0గా పిలుచుకుంటున్న పుజారాకు గాయమైంది.

చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న పుజారా చేతికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. రెండో రోజు ఆటలోనూ అతడు ఫీల్డింగ్ చేయలేదు. అతడి స్థానంలో రిజర్వ్ ఓపెనర్ గా ఉన్న మయాంక్ అగర్వాల్ ఫీల్డ్ లోకి వచ్చాడు.

దీనిపై బీసీసీఐ స్పందించింది. మొదటి రోజు ఆట సందర్భంగా పుజారా కుడి చేతికి గాయమైందని, తర్వాత పుజారాను నొప్పి తీవ్రంగా వేధించిందని పేర్కొంది. దీంతో అతడు ఫీల్డింగ్ కు అందుబాటులో ఉండడని తెలిపింది.

అయితే, పుజారాకు అయిన గాయం తీవ్రతపై మాత్రం బీసీసీఐ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ లోనూ పుజారాకు చాలా గాయాలయ్యాయి. ఆస్ట్రేలియా పేసర్లు నిప్పులు చెరిగిన ఎన్నో బంతులు.. పుజారా ఒంటికి తాకాయి. అయినా చెక్కు చెదరకుండా నిలబడి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు పుజారా.


More Telugu News