రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌పై దాడి: దేవినేని ఉమ ఆగ్ర‌హం

  • రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకుని కాపాడాలి
  • మొద‌టి ద‌శ ఎన్నిక‌లు 9న జ‌ర‌గ‌నున్నాయి
  • రాష్ట్రంలో 20 నెల‌ల్లో ఏయే ఘ‌ట‌న‌లు జ‌రిగాయి?
  • ప్ర‌తి ఒక్క‌రు గుర్తు తెచ్చుకోవాలి
వైసీపీ ప్ర‌భుత్వం ఏపీలో రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌పై దాడి చేస్తోంద‌ని టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకుని కాపాడాల‌ని కోరారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... 'మొద‌టి ద‌శ ఎన్నిక‌లు 9న జ‌ర‌గ‌నున్నాయి. ఓట‌రు మ‌హాశ‌యులు పెద్ద ఎత్తున వ‌చ్చి ఓట్లు వేయాల‌ని కోరుతున్నాను. రాష్ట్రంలో 20 నెల‌ల్లో ఏయే ఘ‌ట‌న‌లు జ‌రిగాయో ప్ర‌తి ఒక్క‌రు గుర్తు తెచ్చుకోవాలి' అని చెప్పారు.

'గ్రామాల్లో వృద్ధుల‌కు రూ.3000 పింఛ‌ను ఇస్తామ‌ని ఎన్నిక‌ల‌ముందు చెప్పారు. కానీ, చేయ‌లేదు. చంద్ర‌బాబు నాయుడు రూ.200 పింఛ‌నును రూ.2000 చేస్తే మీరు అప్ప‌ట్లో అస‌హ్య‌క‌రంగా మాట్లాడారు. పేద‌వారిని స‌రైన విధంగా రేష‌న్ స‌రుకులు కూడా ఇవ్వ‌ట్లేదు' అని చెప్పారు.

'కందిప‌ప్పు, పంచ‌దార ధ‌ర‌ల‌ను విప‌రీతంగా పెంచేశారు. కంది ప‌ప్పు కొంటేనే బియ్యం ఇస్తామ‌ని చెబుతున్నారు. మా బియ్యం మాకు ఇవ్వాలంటే ఇలా చేస్తారా? రేష‌న్ వాహ‌నాల‌కు మీ బొమ్మ‌లు వేసుకుంటారా?   వీటికి ప్ర‌జ‌లు స‌మాధానం అడుగుతున్నారు. ఆర్టీసీ చార్జీలు కూడా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప‌న్నులు వేస్తున్నారు' అని చెప్పారు.

'పీల్చే గాలి మీద త‌ప్పా అన్నింటి మీదా ప‌న్నులు వేస్తున్నార‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. రాష్ట్రాన్ని సీఎం జ‌గ‌న్ అప్పుల ఊబిలోకి లాగారు.  స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ‌కే ఓటు వేయాల‌ని వైసీపీ డ‌బ్బులు పంచుతోంది. మొద‌టి ద‌శ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న ప్రాంతాల్లో వైసీపీ నేత‌లు డ‌బ్బులు పంచుతున్నారు. ప‌క్క రాష్ట్రం నుంచి వాట‌ర్ ట్యాంకుల్లో మ‌ద్యం సీసాల‌ను తీసుకొస్తున్నారు' అని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.  




More Telugu News