ఏపీ హైకోర్టు తరలింపుపై జీవీఎల్ ప్రశ్న... కీలక వివరాలతో సమాధానమిచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి

  • ఏపీలో మూడు రాజధానులకు వైసీపీ సర్కారు నిర్ణయం
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని వెల్లడి
  • గతేడాది ఫిబ్రవరిలో సీఎం జగన్ ప్రతిపాదనలు పంపారన్న కేంద్రం
  • హైకోర్టు, ఏపీ సర్కారు దీనిపై చర్చించుకుంటాయని వివరణ
  • ఏకాభిప్రాయానికి వస్తేనే తరలింపు ఉంటుందని స్పష్టీకరణ
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా కర్నూలుకు హైకోర్టు తరలించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రస్తావన తీసుకువచ్చారు. అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా? అని జీవీఎల్ ప్రశ్నించగా, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బదులిచ్చారు.

ఏపీ హైకోర్టు తరలింపుపై 2020 ఫిబ్రవరిలో సీఎం జగన్ నుంచి తమకు ప్రతిపాదనలు అందాయని వెల్లడించారు. అమరావతి నుంచి కర్నూలు తరలింపు అంశంలో హైకోర్టు, ఏపీ సర్కారుదే తుది నిర్ణయం అని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తరలింపుపై హైకోర్టు, ఏపీ ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరిగిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. అందుకు ఏకాభిప్రాయం ముఖ్యమని తెలిపారు. హైకోర్టును కర్నూలు తరలించే విషయంలో నిర్దేశిత గడువు అంటూ ఏమీ లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. సరిగ్గా చెప్పాలంటే కర్నూలు తరలింపు అంశం ఏపీ హైకోర్టు పరిధిలోనే ఉందని స్పష్టం చేశారు.


More Telugu News