అచ్చెన్నను బేషరతుగా విడుదల చేయండి: చంద్రబాబు

  • జగన్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠ 
  • అక్రమ అరెస్ట్‌లకు మూల్యం చెల్లించుకోక తప్పదు
  • ఉత్తరాంధ్రలో గత 40 ఏళ్లలో ఇలాంటివి ఎప్పుడూ లేవు
  • గతంలో 83 రోజులపాటు అచ్చెన్నను నిర్బంధించారు
ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, ఆయనపై పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ హింసాకాండపై ప్రశ్నించడమే అచ్చెన్న చేసిన తప్పా? అని ప్రశ్నించారు. అచ్చెన్న ఇంటిపైకి కత్తులు, రాడ్లతో దాడికి వచ్చిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నపై పెడతారా? అని నిలదీశారు. ఆయన అరెస్ట్ జగన్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించినదెవరని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై పగబట్టి హింస, వింధ్వంసాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో గత 40 ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. రామతీర్థం ఘటనలో తనపైనా, అచ్చెన్న, కళా వెంకట్రావు, కూన రవికుమార్, వెలగపూడి సహా పలువురిపై కేసు పెట్టారని అన్నారు.

సబ్బంహరి ఇల్లు, గీతం వర్సిటీ భవనాలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. అచ్చెన్నను గతంలో 83 రోజులపాటు అక్రమంగా నిర్బంధించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్‌లకు జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


More Telugu News