శశిథరూర్​ పై దేశ ద్రోహం కేసు.. ఆరుగురు విలేకరులపైనా!

  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన యూపీ, ఎంపీ పోలీసులు
  • పోలీసులు రైతును కాల్చి చంపారన్న శశిథరూర్
  • అందుకే రైతులు ఎర్రకోటను ముట్టడించారని వ్యాఖ్య
  • ఆయన వ్యాఖ్యలపై నోయిడా వ్యక్తి ఫిర్యాదు
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పై ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దేశ ద్రోహం కేసులు నమోదు చేశాయి. ఆరుగురు జర్నలిస్టులపైనా కేసులు పెట్టాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేశారని, సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించారని పేర్కొంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి.

యూపీ నోయిడాలో ఒకటి, మధ్యప్రదేశ్ లోని భోపాల్, హోసంగాబాద్, ముల్తాయ్, బేతుల్ లో నాలుగు ఎఫ్ఐఆర్ లను పోలీసులు నమోదు చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ తో పాటు మృణాల్ పాండే, వినోద్ జోష్, జాఫర్ ఆఘా, పరేశ్ నాథ్, అనంత్ నాథ్ అనే జర్నలిస్టుల పేర్లను ఎఫ్ఐఆర్ లలో చేర్చారు. ఢిల్లీ పోలీసులు రైతును కాల్చి చంపడం వల్లే రైతులు ఎర్రకోటను ముట్టడించారని పేర్కొంటూ శశిథరూర్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని నోయిడా వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ విమర్శించింది. వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తారా? అని ప్రశ్నించింది. విలేకరుల ఖాతాలను పోలీసులు ప్రత్యేకంగా టార్గెట్ చేశారని మండిపడింది. ఘటనా స్థలంలో సాక్షులు చెప్పిన దాని ప్రకారమే వారు పోస్టులు చేశారని, అది జర్నలిస్టుల లక్షణమని పేర్కొంది.


More Telugu News