అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మండిపడుతున్న కాంగ్రెస్

  • సోలార్ యూనిట్ల ఏర్పాటులో అవకతవకలు
  • ప్రధాన నిందితురాలిపై లైంగిక ఆరోపణలు
  • మాజీ సీఎం సహా ఐదుగురిపై కేసులు
  • రాజకీయ ప్రయోజనాల కోసమేనన్న కాంగ్రెస్
2013 నాటి ‘సోలార్ కుంభకోణం’ కేసులో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న మహిళ అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదుతో  కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సహా ఐదుగురిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

ఇప్పుడా కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసును ప్రస్తుతం కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోలార్ యూనిట్ల ఏర్పాటుతో కోట్లాది రూపాయల అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్టు ఆరోపించిన మహిళ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు.

ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించింది. ఈ కేసులో 2018లో నాన్‌బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని మాజీ సీఎం ఉమెన్ చాందీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రమంత్రి మురళీధరన్ కూడా దుమ్మెత్తిపోశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతోనే ఈ కేసును సీబీఐకి అప్పగించిందని ఆరోపించారు.


More Telugu News