కొవాగ్జిన్, కొవిషీల్డ్... ఏది కావాలో ఎంచుకునే అవకాశం లేదన్న కేంద్రం!

  • ఇండియాలో రెండు వ్యాక్సిన్లకు అనుమతి
  • ఎల్లుండి నుంచి ప్రజలకు పంపిణీ
  • 8 నెలల్లో 30 కోట్ల మందికి టీకా
ఇండియాలో ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల వాడకానికి కేంద్రం అనుమతినిచ్చింది. ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారుచేసిన కొవిషీల్డ్, భారత సంస్థ భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ లను ప్రజలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది తమకు ఇవ్వాలని కోరుకునే అవకాశం లబ్దిదారులకు లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నెల 16 నుంచి ఈ రెండు వ్యాక్సిన్ల సరఫరాకు ఏర్పాట్లు ముమ్మరం చేయగా, ఇప్పటికే టీకాలు వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలకు చేరిపోయాయి. అక్కడి నుంచి జిల్లా స్థాయి స్టోరేజ్ కేంద్రాలకు కూడా వెళుతున్నాయి. వీటిని అత్యవసర వినియోగం నిమిత్తం వాడేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతినిచ్చింది.

వ్యాక్సిన్ తయారీకోసం ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసిన అధికారులు, వాటిని రేపు సాయంత్రంలోగా, నిర్దేశిత టీకా కేంద్రాలకు తరలించడంతో పాటు, వాటిని నిర్దేశిత ఉష్ణోగ్రతల మధ్య ఉంచేందుకు అన్ని చర్యలూ చేపట్టారు. తొలి దశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఆపై రానున్న 8 నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తామని అంటున్న కేంద్రం, రెండు టీకాల్లో తమకు ఫలానా టీకా కావాలని ఎవరూ ఎంచుకోలేరని, అది ప్రభుత్వమే నిర్దేశిస్తుందని కేంద్రం పేర్కొంది.

కాగా, ఈ రెండు వ్యాక్సిన్ లూ రెండు డోసులు తీసుకున్న తరువాతనే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. రెండో డోస్ తీసుకున్న 14 రోజుల తరువాత టీకా ప్రభావం కనిపిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు.


More Telugu News