తెలుగుదేశం తెచ్చిన పెట్టుబడులు, కంపెనీలు అన్నింటినీ తరిమేశారు: చ‌ంద్ర‌బాబు

  • ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి చేశాం
  • నవ్యాంధ్రలో ఐదేళ్ల‌లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
  • 30 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేశా
  • వైసీపీ ప్రభుత్వ పాలనలో యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకం
ఏపీ ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటోన్న యువతకు శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి భారతదేశ సొంతం. అపారమైన మేథస్సు, శక్తి సామర్థ్యాలు కలిగిన మన యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నైపుణ్యాల అభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చాం' అని అన్నారు.

'ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి ద్వారా దేశవిదేశాల్లో తెలుగుయువత ప్రతిభకు స్థానం లభించేలా చేశాం. నవ్యాంధ్రలో ఐదేళ్ల‌లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులతో 30లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేశా. ఆ కష్ట ఫలితంగా దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాం, 10లక్షల ఉద్యోగాలు కల్పించాం' అని తెలిపారు

'అలాంటిది గత 19నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. తెలుగుదేశం తెచ్చిన పెట్టుబడులు, కంపెనీలు అన్నింటినీ తరిమేశారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. యువత స్వయం ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. వేలాది యువతీయువకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారు' అంటూ ట్వీట్లు చేశారు.

'ఈ దుస్థితిలో రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలి. మీ కాళ్లపై మీరు నిలబడటమే కాకుండా, సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యత భుజాన వేసుకోవాలి. పాలకుల దుశ్చర్యలపై అన్నివర్గాల ప్రజలను చైతన్యపరచాలి' అని పేర్కొన్నారు.

'వివేకానందుడి మార్గదర్శకంలో హింసా విధ్వంసాలు, కక్ష సాధింపు చర్యలు లేని సమాజాన్ని ఆవిష్కరించాల్సింది యువతరమే. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువతగా మీరంతా రూపొందాలి. అన్ని రంగాల్లో మన దేశాన్ని, రాష్ట్రాన్ని ముందంజ వేయించాలి' అని చంద్ర‌బాబు నాయుడు చెప్పుకొచ్చారు.


More Telugu News