వెళ్తూవెళ్తూ చైనాపై కసి తీర్చుకుంటున్న ట్రంప్.. పేమెంట్ యాప్‌లపై నిషేధం

  • 8 యాప్‌లపై నిషేధం
  • ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్
  • 45 రోజుల్లో నిర్ణయం అమల్లోకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని వీడే  ఘడియలు దగ్గరపడుతున్న వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల వరుసగా వివాదాస్పద  నిర్ణయాలు తీసుకుంటూ మీడియాకెక్కిన ట్రంప్ తాజాగా చైనాపై తన అక్కసును మరోమారు వెళ్లగక్కారు. వెళ్తూవెళ్తూ చైనాకు చెందిన పేమెంట్ యాప్‌లపై నిషేధం విధించారు.

 జాక్‌ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఆధ్వర్యంలోని అలీపే, టెన్సెంట్ గ్రూపునకు చెందిన వీచాట్ పే సహా మొత్తం 8 యాప్‌ల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు నిన్న విడుదల చేసిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. 45 రోజుల్లో ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా, అప్పటికి బైడెన్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.

నిషేధిత యాప్‌లన్నీ వినియోగదారుల సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నాయని, ఫలితంగా కీలక పదవుల్లో ఉన్న వ్యక్తుల సమాచారాన్ని డ్రాగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ట్రంప్ ఆరోపించారు. గతంలో వీచాట్ పేను ట్రంప్  ఓసారి నిషేధించారు. ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యాపార నిర్వహణకు ఈ యాప్‌లు కీలకమని, వీటిపై నిషేధం సరికాదంటూ యాపిల్, ఫోర్డ్ మోటార్, వాల్‌మార్ట్ వంటి ప్రముఖ కంపెనీలు నిరసనగళం వినిపించాయి.

ట్రంప్ నిర్ణయానికి కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ ట్రంప్ మరోమారు చైనా పేమెంట్ యాప్‌లపై విరుచుకుపడడం గమనార్హం. ట్రంప్ తాజా నిర్ణయంపై కాబోయే అధ్యక్షుడు బైడెన్ కానీ, చైనా రాయబార కార్యాలయం నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు.  చైనాకే చెందిన షేర్ ఇట్, కేమ్ స్కానర్, వీమేట్, డబ్ల్యూపీఎస్ ఆఫీస్‌లు కూడా నిషేధిత జాబితాలో ఉండడం గమనార్హం.


More Telugu News