క‌రోనా వ్యాక్సిన్ ను మాకూ ఇస్తామ‌ని గ్యారంటీ ఇవ్వాలి: భార‌త్ ను కోరిన బ్రెజిల్

  • క‌రోనాతో వ‌ణికిపోతోన్న బ్రెజిల్
  • భారత్ ఉత్ప‌త్తి చేస్తోన్న వ్యాక్సిన్లపై ఆశ‌లు
  • భార‌త్ కే తొలి ప్రాధాన్య‌మ‌ని కేంద్రం ప్ర‌క‌ట‌న‌
  • ఆందోళ‌న చెందిన బ్రెజిల్
క‌రోనాతో వ‌ణికిపోతోన్న బ్రెజిల్ భారత్ ఉత్ప‌త్తి చేస్తోన్న వ్యాక్సిన్ల‌పై పెద్దగా ఆశలు పెట్టుకుంది. అయితే, ఆక్స్ ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజ‌న్యంతో భార‌త్ లో త‌యారైన కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం దేశీయ అవసరాలకే అని భార‌త్ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయ‌డంతో దీనిపై బ్రెజిల్ ఆందోళ‌న చెందుతోంది. దీనికి తోడు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనవాలా కూడా ఎగుమతులపై కేంద్ర స‌ర్కారు ఆంక్షలు విధించవచ్చని చెప్పారు.

ఈ నేప‌థ్యంలో తమకు ఆ వ్యాక్సిన్ అందేలా గ్యారెంటీ ఇవ్వాలంటూ భార‌త ప్ర‌భుత్వాన్ని బ్రెజిల్ స‌ర్కారు కోరింది. దౌత్య మార్గాల్లో భారత్ కు ఈ వినతి చేసింది. త‌మ దేశానికి వ్యాక్సిన్ పంపిణీ విష‌యంలో ఎటువంటి ఆంక్షలను విధించవద్ద‌ని కోరింది. బ్రెజిల్ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్లు అందించ‌డం కోసం పలు ప్రైవేటు క్లినిక్‌లు కొవాగ్జిన్ టీకా కోసం కూడా భారత్ బయోటెక్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. భార‌త్ కు బ్రెజిల్ చేసిన విన‌తి అక్క‌డి ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను తెలియ‌జేస్తున్నాయ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


More Telugu News