ఆన్‌లైన్ మనీయాప్ వ్యవహారం.. కన్నకొడుకును అరెస్ట్ చేయించిన పోలీసు!

  • బెంగళూరులోని కాల్‌సెంటర్‌లో ఉద్యోగం
  • ఇంటికి పిలిపించి అరెస్ట్ చేయించిన తండ్రి
  • తమ్ముడి అరెస్ట్‌తో లొంగిపోయిన అన్న
తన కుమారుడు లక్షలాదిమందిని మోసం చేసినట్టు తెలుసుకున్న ఓ పోలీసు అధికారి అతడిని సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టించాడు. కర్నూలు జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న వ్యక్తికి నాగరాజు, ఈశ్వర్ కుమార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ బెంగళూరులో ఆన్‌లైన్ మనీ యాప్‌ సంస్థకు చెందిన కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఈ యాప్‌ల ద్వారా తన కుమారుడు నాగరాజు లక్షలాదిమందిని మోసం చేసిన విషయం ఇటీవలే అతడి తండ్రి అయిన ఏఎస్సైకి  తెలిసింది.

నిజాయతీపరుడైన ఆయన ఈ విషయాన్ని సహించలేకపోయాడు. విషయం చెప్పకుండా తక్షణం ఇంటికి రావాలని నాగరాజును కోరాడు. మూడు రోజుల క్రితం అతడు ఇంటికి చేరుకోగా, సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించాడు. ఆ తర్వాత నాగరాజు అన్న ఈశ్వర్ కుమార్ కూడా పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది.

బంధం కంటే బాధ్యత గొప్పదని భావించి కన్న కుమారులనే పోలీసులకు పట్టించిన ఏఎస్సైపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా, తన కుమారుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆయన తన పేరు, వివరాలను బయటపెట్టవద్దని సైబర్ క్రైం పోలీసులను కోరారు.


More Telugu News