మత మార్పిడికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపనున్న మధ్యప్రదేశ్!

  • కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ కేబినెట్
  • ఉక్కుపాదంతో అణచివేస్తామన్న శివరాజ్ సింగ్ చౌహాన్
  • కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదన్న హోంమంత్రి
బలవంతపు మతమార్పిడులపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతోంది. మతమార్పిడులను నివారించేందుకు తీసుకొచ్చిన బిల్లును ఈరోజు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందితే... మత మర్పిడులకు పాల్పడే వారికి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష.. రూ. లక్ష వరకు జరిమానా విధించే పరిస్థితి ఉంది. ఈ శిక్ష కేవలం సదరు వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. మత సంబంధమైన సంస్థలు కూడా ఈ చట్టం కింద శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ బిల్లును 'ధర్మ స్వతంత్ర్య బిల్లు 2020'గా కేబినెట్ మీటింగ్ టేబుల్ పై పెట్టారు.

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, అమాయకమైన బాలికలను బుట్టలో వేసుకునే ప్రయత్నాలను తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచి వేస్తుందని చెప్పారు. పంచాయతి ఎన్నికలలో పోటీ చేసేందుకు మన బిడ్డలను పెళ్లి చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ, మతమార్పిడులకు పాల్పడేవారు కఠిన శిక్షలను ఎదుర్కోక తప్పదని చెప్పారు.


More Telugu News