సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని జేసీ ఇంటికి వెళ్లాను... వాళ్లే దాడి చేశారు: కేతిరెడ్డి పెద్దారెడ్డి

  • తాడిపత్రిలో ఉద్రిక్తత
  • జేసీ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి
  • ఇరువర్గాల మధ్య ఘర్షణ
  • జేసీతో చర్చిద్దామని వెళ్లానన్న కేతిరెడ్డి
  • జేసీ అనుచరులు రాళ్లదాడి చేశారని వెల్లడి
  • పోలీసులపైనా దౌర్జన్యం చేశారని వ్యాఖ్యలు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి వివరణ ఇచ్చారు. తాను సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లానని, కానీ జేసీ అనుచరులే తమపై దాడికి దిగారని, పోలీసులపైనా వారు దౌర్జన్యం చేశారని పెద్దారెడ్డి వెల్లడించారు.

సోషల్ మీడియాలో తమ కుటుంబంపై చేస్తున్న ఆరోపణల విషయం చర్చించడానికి వెళ్లానని, ఆ సమయంలో జేసీ ఇంట్లో లేరని తెలిపారు. ఘర్షణకు దిగాలన్న ఆలోచన తనకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్య రాకూడదన్న ఆలోచనతోనే జేసీతో చర్చించేందుకు వెళితే తమపై రాళ్లదాడి జరిగిందని వివరణ ఇచ్చారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు చేయాల్సినంత పిరికితనం తనకు లేదని, టీడీపీ హయాంలో జేసీ పోలీసుల అండతో తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేశాడో ప్రజలకు తెలుసని అన్నారు. కాగా, తాడిపత్రిలో ఇవాళ జరిగిన ఘటనల నేపథ్యంలో ఆందోళనకారులు ఎమ్మెల్యే పెద్దారెడ్డికి చెందిన వాహనాన్ని ధ్వంసం చేశారు.


More Telugu News