ఒకే కుటుంబంలోని 11 మందిపై ‘లవ్ జిహాద్‘ కేసు

  • తండ్రి ఫిర్యాదు మేరకు యూపీలోని ఈటా పోలీసుల ఎఫ్ఐఆర్
  • ఆరుగురి అరెస్ట్.. పరారీలో ప్రధాన నిందితుడు సహా ఐదుగురు
  • ఒక్కొక్కరి తలపై రూ.25 వేల రివార్డ్ ప్రకటించిన పోలీసులు
  • నెల క్రితం కనిపించకుండా పోయిన 21 ఏళ్ల యువతి
  • మతం మార్చి పెళ్లి చేసుకున్నట్టు ఆమె తండ్రికి యువకుడి లేఖ 
ఒకే కుటుంబానికి చెందిన 11 మందిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ‘లవ్ జిహాద్’ కేసు నమోదు చేశారు. అందులో ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. ఒక్కొక్కరి తలపై రూ.25 వేల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఓ 21 ఏళ్ల యువతి తండ్రి ఫిర్యాదు మేరకు యూపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మతమార్పిడి వ్యతిరేక చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నెల క్రితం సదరు యువతి కనిపించకుండా పోయింది. ఆమెను మహ్మద్ జావెద్ అనే 25 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకున్నాడు. మతం మార్చి పెళ్లి చేసుకున్నట్టు తన లాయర్ ద్వారా ఆ అమ్మాయి తండ్రికి లేఖ రాశాడు. ఆ లేఖ ఆధారంగా యువతి తండ్రి గత గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు ఆధారంగానే జావెద్ సహా అతడి కుటుంబ సభ్యులు 11 మందిపై నమోదు చేసినట్టు యూపీ ఈటాలోని జలేసర్ పోలీసులు చెప్పారు.

శని, ఆదివారాల్లో అరెస్ట్ చేసిన ఆ ఆరుగురు జావెద్ కు దూరపు బంధువులని, అతడితో కాంటాక్ట్ లో ఉండడం వల్లే అరెస్ట్ చేశామని తెలిపారు. అక్రమంగా మతమార్పిడికి పాల్పడి, పెళ్లి చేసుకున్న కేసులో వాళ్లందరికి ప్రమేయం ఉందని, ఈ విషయంలో జావెద్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కృష్ణపాల్ సింగ్ చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు వాళ్లను జైలుకు పంపించామన్నారు. జావెద్ తో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.

అందరిపైనా ఐపీసీ సెక్షన్ 366 (కిడ్నాప్, బలవంతపు పెళ్లి), అక్రమ మతమార్పిడి నిరోధక ఆర్డినెన్స్ కింద కేసులు నమోదు చేసినట్టు డీఎస్ పీ రామ్ నివాస్ సింగ్ వెల్లడించారు. యువతి నవంబర్ 17 నుంచి కనిపించకుండా పోయిందని, అయితే గురువారం వరకు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని మరో అధికారి చెప్పారు. జావెద్ అనే వస్త్ర వ్యాపారి ఈటాలోని యువతి ఇంటికి సమీపంలోనే నివసించేవాడని చెప్పారు.


More Telugu News