సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేం: ఎస్ఈసీ అప్పీలుపై హైకోర్టు

  • సింగిల్ జడ్జి ఆదేశాలపై అప్పీలు చేసిన ఎస్ఈసీ   
  • సోమవారం సింగిల్ జడ్జి విచారణ ఉందన్న కోర్టు
  • ఆ తర్వాత అభ్యంతరాలుంటే అప్పీల్ చేయాలని సూచన
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ మార్కే కాకుండా, ఎలాంటి గుర్తు పెట్టినా, చివరకు పెన్నుతో టిక్ పెట్టినా ఓటును పరిగణనలోకి తీసుకోవాలంటూ మొన్న అర్ధరాత్రి ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా... ఆ ఉత్తర్వులను ఆపివేస్తూ సింగిల్ జడ్జ్ ఆదేశాలు జారీచేశారు. దీనిపై ఎస్ఈసీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల నేరేడ్ మెట్ డివిజన్ లో ఫలితం నిలిచిపోయిందని కోర్టుకు ఎస్ఈసీ తెలిపింది. అయితే, సింగిల్ జడ్జి బెంచ్ వద్ద సోమవారం ఈ అంశంపై విచారణ ఉన్నందున అత్యవసరంగా తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. సింగిల్ జడ్జి విచారణ పూర్తయ్యాక అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేయాలని సూచించింది. సోమవారం ఉదయం ఇదే అంశంపై తొలుత విచారణ జరపాలని సింగిల్ జడ్జ్ కు సూచించింది.


More Telugu News