సినీ స్టూడియోలకు గత ప్రభుత్వాలు కూడా నామమాత్రపు ధరకే భూములు ఇచ్చాయి: హైకోర్టుకు తెలిపిన తెలంగాణ సర్కారు

  • దర్శకుడు ఎన్.శంకర్ కు 5 ఎకరాలు ఇచ్చిన తెలంగాణ సర్కారు
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కరీంనగర్ జిల్లా వాసి
  • స్టూడియోతో ఉపాధి కల్పన జరుగుతుందన్న ప్రభుత్వం
  • పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టుకు వినతి
  • కౌంటర్ దాఖలు చేసిన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి
టాలీవుడ్ దర్శకుడు ఎన్.శంకర్ కు తెలంగాణ ప్రభుత్వం ఎకరా రూ.5 లక్షల చొప్పున మోకిల్ల ప్రాంతంలో 5 ఎకరాల భూమిని కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లాకు చెందిన జె.శంకర్ అనే వ్యక్తి ఈ మేరకు పిల్ వేశాడు. గతంలో ఈ పిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

దర్శకుడు ఎన్.శంకర్ వంటి స్థానిక ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో శంకర్ కు భూమిని కేటాయించాలంటూ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిఫారసు చేసిందని ఆ కౌంటర్ లో తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో స్టూడియో నిర్మించేందుకు తనకు రాయితీపై భూమి కేటాయించాలని శంకర్ 2016లో దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈ మేరకు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కూడా సిఫారసు చేసిందని అరవింద్ కుమార్ వెల్లడించారు.

ఈ క్రమంలో శంకర్ కు నార్సింగి, శంకర్ పల్లి రహదారికి సమీపంలో ఎలాంటి అభివృద్ధి చేయని భూమిని ఇచ్చామని, వాస్తవానికి అక్కడ మార్కెట్ ధర ఎకరాకు రూ.20 లక్షలుగా ఉందని, అయితే సినీ పరిశ్రమ అభివృద్ధి జరిగితే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎకరా రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలు కేటాయించిందని తెలిపారు. సినీ స్టూడియోలకు ప్రభుత్వాలు తక్కువ ధరలకే భూములు ఇవ్వడం ఇదే ప్రథమం కాదని, గత ప్రభుత్వాలు కూడా హైదరాబాదులో సినీ స్టూడియోలకు నామమాత్రపు ధరనే వసూలు చేశాయని అరవింద్ కుమార్ తమ కౌంటర్ లో ప్రస్తావించారు.

అక్కినేని నాగేశ్వరరావుకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ కోసం 1975లో ఎకరా రూ.5 వేల ధరతో 22 ఎకరాలు.... పద్మాలయా స్టూడియో కోసం 1983లో ఎకరా రూ.8,500 చొప్పున తొమ్మిదిన్నర ఎకరాలు... 1984లో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు స్టూడియో నిర్మాణం కోసం నామమాత్రపు ధరతో 5 ఎకరాలు... అదే ఏడాది దర్శకుడు రాఘవేంద్రరావు తదితరులకు కూడా నామమాత్రపు ధరలకే భూమి కేటాయించడం జరిగిందని వివరించారు.

ఇప్పుడు ఎన్.శంకర్ నిర్మించబోయే స్టూడియో కారణంగా వందల మందికి ఉపాధి కలుగుతుందని, అందుకే ఈ అంశంపై దాఖలైన పిల్ ను కొట్టివేయాలని కోరుతున్నామని అరవింద్ కుమార్ ప్రభుత్వం తరఫున న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.


More Telugu News