హిందీలో వస్తున్న 'బొమ్మరిల్లు'.. పూర్తయిన 13 ఏళ్ల తర్వాత విడుదల

  • 2006లో వచ్చిన 'బొమ్మరిల్లు' పెద్ద హిట్
  • 'ఇట్స్ మై లైఫ్' పేరిట హిందీలో రీమేక్
  • కారణాంతరాల వల్ల విడుదల కాని వైనం
  • ఈ నెల 29న 'జీ సినిమా'లో విడుదల
2006లో వచ్చిన 'బొమ్మరిల్లు' సినిమా అప్పట్లో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అన్ని విషయాలలోనూ పిల్లల ఇష్టాయిష్టాలను గుర్తెరిగి, వారి మాటకు కూడ విలువ ఇస్తూ.. ఆ ప్రకారం తల్లిదండ్రులు మసలుకోవాలనే సందేశాన్ని వినోదాత్మకంగా అందించిన తీరు ప్రేక్షకులకు బాగా పట్టేసింది.

ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ప్రకాశ్ రాజ్, సిద్ధార్థ్ ల అభినయం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే అల్లరి అమాయకపుపిల్లగా జెనీలియా నటన హత్తుకుంది. ఇక సంగీతంపరంగా పాటలు సరేసరి. దీనికి దర్శకత్వం వహించిన భాస్కర్ అప్పటి నుంచీ 'బొమ్మరిల్లు' భాస్కర్ గా చలామణీ అవుతున్నాడు.  

ఇక ఈ చిత్రాన్ని అప్పట్లోనే 'ఇట్స్ మై లైఫ్' పేరుతో హిందీలో కూడా రీమేక్ చేశారు. హర్మన్ బవేజ, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నానా పటేకర్ నటించాడు. విచిత్రం ఏమిటంటే, 2007లోనే చిత్ర నిర్మాణం పూర్తయినప్పటికీ, కారణాంతరాల వల్ల ఇప్పటివరకు ఇది విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 29న 'జీ సినిమా'లో డైరెక్టుగా రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. మరి, హిందీ ప్రేక్షకులను ఇది ఎంతవరకు అలరిస్తుందో చూడాలి!


More Telugu News