మళ్లీ థియేటర్లకు వస్తున్న 'బాహుబలి'!

  • తెలుగు సినిమా స్థాయిని పెంచిన 'బాహుబలి'
  • పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్  
  • హిందీ వెర్షన్ ను మళ్లీ విడుదల చేస్తున్న కరణ్ 
  • ఈ శుక్రవారం ఒకటి.. వచ్చే శుక్రవారం మరొకటి  
'బాహుబలి' సినిమాలు ఒక సంచలనం. తెలుగు సినిమా స్థాయిని, ఖ్యాతిని దేశ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన సినిమాలవి. దర్శకుడు రాజమౌళి దర్శక ప్రతిభకు పట్టంకట్టిన చిత్రాలు. హీరో ప్రభాస్ కు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిన సినిమాలు బాహుబలి సీరీస్.

ఈ సినిమాల తర్వాతే ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ఆయన సినిమాల బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగా మార్కెట్ కూడా విస్తృతమైపోయింది. ఆ తర్వాత నుంచే అతని సినిమాలు హిందీ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మాణం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో, అంతటి సంచలన విజయాలను సాధించిన 'బాహుబలి-ద బిగినింగ్', 'బాహుబలి-ద కంక్లూజన్' చిత్రాల హిందీ వెర్షన్లను ఇప్పుడు మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ ఫిలిం మేకర్ ఈ చిత్రాల పంపిణీదారు అయిన కరణ్ జొహార్ ప్రకటించాడు.

ఈ శుక్రవారం 'బాహుబలి- ద బిగినింగ్' రిలీజవుతుందనీ, వచ్చే శుక్రవారం 'బాహుబలి- ద కంక్లూజన్' రిలీజ్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయా నగరాలలో ప్రభుత్వ నిబంధనల మేర ఈ చిత్రాల విడుదల ఉంటుందని ఆయన తెలిపారు.


More Telugu News