జనాల సొమ్ముతో జగన్ ప్రచారం చేసుకుంటున్నారు: టీడీపీ నేత పట్టాభి

  • జగన్ కు ప్రచార పిచ్చి పట్టుకుంది
  • రైతు భరోసాతో రైతుల నోట్లో మట్టికొడుతున్నారు
  • కౌలు రౌతుల సంఖ్యను కూడా పూర్తిగా తగ్గించారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత పట్టాభి విమర్శలు గుప్పించారు. జగన్ కు ప్రచార పిచ్చి పట్టుకుందని... తన ప్రచార పిచ్చిని తీర్చుకునేందుకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనంతో పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం జగన్ కు అలవాటైపోయిందని అన్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సొమ్ముకు అదనంగా రూ. 7,500 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు.

మొత్తం 64.06 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నట్టు అసెంబ్లీలో మంత్రి బుగ్గన చెప్పారని... 2019 అక్టోబర్ లో ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలో ఆ సంఖ్య 54 లక్షలకు తగ్గిందని, 2020 అక్టోబర్ లో సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనలో ఆ సంఖ్య 50.47 లక్షలకు చేరిందని, పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లో ఉన్న వివరాల ప్రకారం ఆ పథకంతో అనుసంధానమైన రైతు భరోసా రైతుల సంఖ్య కేవలం 38,45,945 అని ఉందని... ఈ లెక్కల్లో ఏది కరెక్ట్? అని ప్రశ్నించారు. పొంతన లేని లెక్కలతో, తప్పుడు ప్రచారాలతో జనాలను ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. మోసపూరిత పథకమైన రైతు భరోసాతో రైతుల నోట్లో జగన్ మట్టికొట్టారని దుయ్యబట్టారు.

రైతు భరోసా కింద 2019-20లో లబ్ధి పొందిన కౌలు రైతుల సంఖ్య 1.58 లక్షలుగా ఉందని... 2020-21కి వచ్చే సరికి ఈ సంఖ్య 41,243కి పడిపోయిందని పట్టాభి మండిపడ్డారు. ఈ సంఖ్య తగ్గిపోవడంపై మంత్రి కన్నబాబు ఏం చెపుతారని ప్రశ్నించారు. భారీ వర్షాలతో పూర్తిగా నష్టపోయి విలపిస్తున్న రైతులను ఒక్క మంత్రి కూడా పరామర్శించలేదని... ఇదే సమయంలో రైతుల వద్దకు వెళ్లిన నారా లోకేశ్ పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన ఘనత జగన్ దే నని విమర్శించారు.


More Telugu News