మోదీకి బీహార్ ప్రజల మద్దతు లేదు: శత్రుఘ్న సిన్హా

  • మోదీ ర్యాలీలు పేలవంగా సాగుతున్నాయి
  • ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
  • రాష్ట్రంలోని పేదరికం, నిరుద్యోగంపై మోదీ మాట్లాడడం లేదు
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బీహార్ ప్రజల మద్దతు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా అన్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ బీహార్ ర్యాలీలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. మోదీ పర్యటన పేలవంగా ఉందని, ఆయనకు ప్రజల మద్దతు లేదని అన్నారు. బీహార్‌లో పేదరికం, నిరుద్యోగం, తలసరి ఆదాయం గురించి మోదీ తన ర్యాలీల్లో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రానికి చెందిన ఎంతోమంది వలస కార్మికులు లాక్‌డౌన్ సమయంలో కాలినడకన వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయినప్పటికీ వలస కార్మికులకు సంబంధించిన డేటా తమ వద్ద లేదని ప్రభుత్వం చెబుతోందని శత్రుఘ్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాఘట్‌బంధన్ నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్‌పై సిన్హా ప్రశంసలు కురిపించారు. ఆయన నాయకత్వం బలంగా ఉందన్నారు. కాగా, పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై సిన్హా కుమారుడు లవ్ సిన్హా బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ నేత నితిన్ నవీన్ ఉన్నారు. నితిన్ నవీన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


More Telugu News