దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ వెర్నాన్ ఫిలాండర్ సోదరుడి కాల్చివేత

  • కేప్ టౌన్ లో ఘటన
  • పొరుగు వ్యక్తికి నీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన ఫిలాండర్ తమ్ముడు
  • తుపాకీ తూటాలకు బలి
కొంతకాలం కిందట అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ వెర్నాన్ ఫిలాండర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వెర్నాన్ ఫిలాండర్ తమ్ముడు టైరోన్ ఫిలాండర్ ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. పొరుగు వ్యక్తికి నీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన టైరోన్ పై గుళ్ల వర్షం కురిపించారు. కేప్ టౌన్ లోని రావెన్స్ మీడ్ వద్ద ఉన్న ఫిలాండర్ కుటుంబ సభ్యుల నివాసం వద్ద ఈ ఘటన జరిగింది.

ఈ దారుణ హత్యకు కారణమేంటో తెలియదని, తమ కుటుంబ సభ్యులను ఈ కష్ట సమయంలో ఎవరూ మరింత కలతకు గురిచేయవద్దని, తమను ఏకాంతంగా వదిలేయాలని వెర్నాన్ ఫిలాండర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. టైరోన్ ఎప్పుడూ తమ హృదయాల్లో నిలిచి ఉంటాడని భావోద్వేగాలకు లోనయ్యాడు.

కాగా, పోలీసులు కూడా ఈ హత్యపై ఎలాంటి అంచనాకు రాలేకపోతున్నారు. హత్య జరిగినట్టు భావిస్తున్నా, ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు లేవు. బుధవారం లంచ్ వేళ ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఫిలాండర్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలోనే ఉన్నారని ఓ స్థానికుడు తెలిపారు.


More Telugu News