హత్రాస్ ఘటనలో ట్విస్ట్... అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి

  • మీడియాకు వివరాలు తెలిపిన అడిషనల్ డీజీ
  • ఆమె మెడపై గాయంతోనే మరణించిందని వెల్లడి
  • కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో 19 ఏళ్ల దళిత అమ్మాయిపై పాశవిక రీతిలో అత్యాచారం చేశారంటూ దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. బాధితురాలు ఆసుపత్రిలో మృతి చెందడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఘటనలో యువతిపై అత్యాచారం జరగలేదని యూపీ అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని తెలిపారు. మెడలో తీవ్ర గాయం కారణంగానే ఆమె మరణించిందని వివరించారు.

"ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వచ్చింది. ఆ నమూనాలు వీర్యానికి సంబంధించినవి కావని వెల్లడైంది. తద్వారా ఆమెపై అత్యాచారం గానీ, సామూహిక అత్యాచారం గానీ జరగలేదని స్పష్టమైంది. అంతేకాదు, పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలోనూ అత్యాచారం అని పేర్కొనలేదు. ఆమె తనపై దాడి జరిగిందన్న విషయాన్నే ప్రస్తావించింది" అని వివరించారు.

అయితే సామాజిక సామరస్యతను దెబ్బతీసేందుకు కొందరు కుల హింసను రెచ్చగొడుతున్నారని, కొందరు వ్యక్తులు తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్నారని ఏడీజీ పేర్కొన్నారు.


More Telugu News