ప్రతిరోజు నరసాపురం-హైదరాబాద్ రైలు నడపాలి: రఘురామకృష్ణరాజు
- విజయవాడ డీఆర్ఎమ్ కు రఘురామకృష్ణరాజు లేఖ
- నరసాపురం ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఎంపీ
- అంతర్రాష్ట్ర ప్రయాణ పరిమితులు తొలగించారని వెల్లడి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నియోజకవర్గ ప్రజల సమస్యలపై స్పందించారు. నరసాపురం ప్రాంత ప్రజలు హైదరాబాద్ నగరానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరోనా కారణంగా విధించిన అంతర్రాష్ట్ర ప్రయాణ పరిమితులు ఇప్పుడు ఎత్తివేయడం జరిగిందని, అందువల్ల ప్రతి రోజు నరసాపురం-హైదరాబాదు రైలును నడిపేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ను కోరారు. ఈ మేరకు డీఆర్ఎమ్ కు లేఖ రాశారు. వీలైతే ఈ వారం నుంచే రైలును నడపాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.