నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు: జగన్

  • వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్థంతి సందర్భంగా నివాళి
  • ఆ మ‌హానేత శ‌రీరానికే మ‌ర‌ణం ఉంటుంది
  • కానీ, ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ ఉండ‌దు
  • నా ప్రతి అడుగులోనూ నాన్న‌ తోడుగా ఉంటున్నారు
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్థంతి సందర్భంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. 'నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ, ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దు. నా ప్రతి అడుగులోనూ నాన్న‌ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు' అని జగన్ ట్వీట్ చేశారు.

కాగా, వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయనకు జగన్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జగన్‌తో పాటు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో వారంతా కలిసి పాల్గొన్నారు. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. 


More Telugu News