నాన్న ఆరోగ్యం నిన్నటి కంటే ఈ రోజు మరింత మెరుగ్గా వుంది!: బాలు తనయుడు చరణ్

  • ఈ మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లానన్న బాలు తనయుడు  
  • ఊపిరితిత్తులు మెరుగుపడుతున్నాయని ప్రకటన
  • సంగీతాన్ని కూడా వింటున్నారని తెలిపిన చరణ్
తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం కొంచెం మెరుగ్గా ఉందని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ తెలిపారు. ఈ మధ్యాహ్నం తాను ఆసుపత్రికి వెళ్లానని... నాన్నకు చికిత్స అందిస్తున్న వైద్యులందరితో మాట్లాడానని ఆయన చెప్పారు. నిన్నటి కంటే ఈరోజు ఆయన ఊపిరితిత్తుల పరిస్థితి మెరుగ్గా ఉందని... మత్తులో ఆయన లేరని వైద్యులు తెలిపారని వెల్లడించారు. అనారోగ్యం నుంచి కోలుకునే క్రమంలో తొలి అడుగు పడిందని చెప్పారు. తక్షణమే నాన్న కోలుకోకపోయినా... నెమ్మదిగా ఆయన కోలుకుంటారని తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు చెప్పిన మాటలతో తనకు పూర్తి నమ్మకం కలిగిందని చెప్పారు.

నాన్నను ఈరోజు తాను చూశానని... ఈరోజు ఆయన స్పృహలోనే ఉన్నారని చరణ్ తెలిపారు. నిన్నటి కంటే ఎంతో మెరుగ్గా కనపడ్డారని చెప్పారు. తనతో ఏదో చెప్పాలని ఆయన ప్రయత్నించారని... కానీ, కుదరలేదని... వారం రోజుల్లో ఆయన మాట్లాడగలుగుతారని తెలిపారు. నాన్నతో ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివించాలని డాక్టర్లను తాను కోరానని చెప్పారు. ప్రస్తుతం ఆయన సంగీతాన్ని వింటున్నారని... దానికి తగ్గట్టుగా కొంత వరకు శరీరాన్ని కదుపుతున్నారని, పాట పాడేందుకు కూడా యత్నిస్తున్నారని... ఆయన కోలుకుంటున్నారనేదానికి ఇదొక సూచిక అని తెలిపారు. నాన్న కోలుకోవాలని ప్రార్థిస్తున్న అందరికీ ధన్యవాదాలు చెపుతున్నామన్నారు.


More Telugu News